
బైబిల్లో పరువు హత్య
అన్యుడిని పెళ్ళాడి నా పరువు తీసింది నా కూతురు. వాడు చస్తే కాని నా పరువు నిలబడదు. – మారుతీరావు
అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. (2 సమూయేలు 12:14-15)
దావీదు చేసిన పని వలన యెహోవాకు పరువు పోయింది. శత్రువులకు యెహోవాను దూషించడానికి ఒక అవకాశం దక్కింది. కనుక దావీదుకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చస్తాడు(యెహోవా చేతిలో) అని యెహోవా పంపిన ప్రవక్త నాతాను దావీదుకు వార్నింగ్ ఇచ్చాడు.
ఇంతకీ దావీదు చేసిన ఏ పని వలన యెహోవా పరువు పోయింది?
నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? #హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? (2 సమూయేలు 12:9)
“నీవు నన్ను లక్ష్యము చేయక #హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.” (2 సమూయేలు 12:10)
“హిత్తీయుడు అయిన ఊరియా భార్య ” అనేది యెహోవా యొక్క ప్రాబ్లెమ్. అందుకే ఆ #హిత్తీయుడగు అనే పదాన్ని రెండు సార్లు నొక్కి వక్కాణించారు బైబిల్ రచయితలు.
హిత్తీయులు విగ్రహారాధకులు. వారిని పెళ్లాడ కూడదు అని యెహోవా అంతక ముందే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ద్వితీయోపదేశకాండము 7:1-4
నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.
నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
మారుతీరావు కి యెహోవాకు ఉన్న పోలికలు:
- అన్యులపై ద్వేషం:
మన వాళ్ళను తప్ప వేరే వాళ్ళను పెళ్లాడకూడదు అని ప్రతి కులపిచ్చి తల్లి తండ్రులు చెప్పినట్టే మారుతీరావు కూడా తన కూతురికి చెప్పి కాలేజీలకు పంపించి ఉంటాడు కదా ! అలాగే యెహోవా కూడా దావీదు లాంటి తన అనుచరులకు చెప్పాడు. కానీ దావీదు వినలేదు. అందుకే అన్యులను పెళ్లి చేసుకొని తన పరువుతీసిన దావీదుకు తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు యెహోవా.
అందుకే నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని దావీదు ఎంత వేడుకున్నా క్షమించినట్టు బయటకు నటించి దావీదుకు బత్షెబాకు పుట్టిన బిడ్డను కొట్టి చంపేశాడు .
- కని పెంచిన అధికారం:
మారుతీరావు తన కూతురిని కని పెంచాను అన్న గర్వంతో ప్రణయ్ ని హత్య చేశాడు. యెహోవా కూడా అంతే..!
దావీదు తన కొడుకు అని యెహోవా ప్రకటించుకున్నాడు.
కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.(కీర్తనల గ్రంథము 2:7)
దావీదుకి తాను ఎన్నో సదుపాయాలు సమకూర్చాను అని యెహోవా చెప్పుకొచ్చాడు.
నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.(2 సమూయేలు 12:8)
తన కూతురుకి సదుపాయాలు సమకూర్చిన మారుతీరావు ప్రణయ్ ని ఎందుకు చంపాలి? తండ్రిగా కూతురుని అభివృద్ధిలోకి తెచ్చాడు. అందుకు అని ఆమె భర్తను చంపేయవచ్చా ? దావీదుని పైకి తీసుకువచ్చాడు యెహోవా. అందుకు అని అతని కొడుకుని చంపేయవచ్చా ? ఒక తండ్రిగా దావీదుని ప్రయోజకుడిని చేయడం యెహోవా బాధ్యత కాదా? అందులో కూడా “నేను నీకు ఇది చేశాను. అది చేశాను” అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటారా?
ఇక 3 వ పోలిక:
ప్రణయ్ హత్య – దావీదు కొడుకు హత్య
ప్రణయ్ ని పెళ్లాడిన మారుతీరావు కూతురు సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంటే మారుతీరావుకి కడుపు మండింది. యెహోవాకు కూడా అంతే.!
ఒక వేళ మారుతీరావు కూతురు తప్పు చేస్తే మారుతీరావు తన కూతురుని చంపుకోవాలి. ప్రణయ్ ని చంపడం ఏమిటి? దావీదు తప్పు చేస్తే దావీదుని చంపాలి . కానీ యెహోవా దావీదు కొడుకుని చంపి తన కొడుకు ఐన దావీదు ని వదిలేయటం ఏమిటి?
ఇది న్యాయం అంటారా ? పరువు కోసం పసిపిల్లాడిని చంపడం న్యాయమే అంటారా ?పరువు కోసం మారుతీరావు అన్యుడైన ప్రణయ్ ని చంపడం న్యాయం అంటారా ?
ఆలోచించండి.