
బైబిల్ బానిసలు టైపు -4 (బానిసత్వంలోకి బానిసల రక్త సంబంధీకులు)
వివరణ:
మొదట యజమాని ఒక హీబ్రూ బానిసను వెల ఇచ్చి కొనుక్కుంటాడు. తర్వాత ఆ హీబ్రూ బానిసకు అతని యజమాని మరొక బానిస స్త్రీని ఇచ్చి పెళ్లి చేస్తాడు. 6 ఏళ్ళ కాలపరిమితి దాటిన తర్వాత హీబ్రూ బానిస యజమాని దగ్గర నుండి విడుదల అయ్యే సమయానికి ఒక వేళ ఆ హీబ్రూ మగబానిసకు “యజమాని ఇచ్చిన ఆడబానిస” వలన పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా యజమాని సొత్తు అవుతారు. ఆడ హీబ్రూ బానిస యజమాని ఇచ్చినదే కాబట్టి ఆమె కూడా యజమాని సొత్తు అవుతుంది. కాబట్టి భార్యా పిల్లలు కావాలనుకుంటే హీబ్రూ మగ బానిస యజమానితో “నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని ” అని చెప్పాలి. తర్వాత ఆ హీబ్రూ బానిస జీవితాంతం యజమాని దగ్గరే ఉండిపోవాలి. భార్యా పిల్లలు వద్దు అనుకుంటే ఖాళీ చేతులతో వెళ్లిపోవచ్చును.
హీబ్రూ బానిస తన భార్యతో వచ్చి ఉంటే భార్యతో వెళ్లిపోవచ్చును. పిల్లలతో వస్తే పిల్లలతో వెళ్లిపోవచ్చును. ఖాళీ చేతులతో వస్తే ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి. యజమాని ఇచ్చిన భార్య, ఆమెకు పుట్టిన పిల్లలను వదిలి వెళ్లిపోవచ్చును. వాళ్ళు యజమాని సొత్తు అవుతారు.
ఇది యెహోవా పెట్టిన ఒక విచిత్రమైన నియమం.
ఈ క్రింది వచనాలు చూడండి.
నిర్గమకాండం 21వ అధ్యాయం 1-6 వచనాలు.
నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

అర్ధం అయ్యింది కదా.
ఇప్పుడు ఆ వ్యక్తి తనకు భార్యా పిల్లలు కావాలనుకుంటే ఏం చెయ్యాలి? జీవితాంతం బానిసగా బతకాలి.
ఒకవేళ అతను భార్యా పిల్లలు వద్దు అనుకొని వెళ్ళిపోతే అతని భార్యా పిల్లలు యజమాని దగ్గర ఊడిగం చెయ్యాలి.
బానిసత్వాన్ని ఇంతగా సపోర్ట్ చేయడం దేవుడని చెప్పుకునే యెహోవాకి తగునా?
ఒకసారి తన భార్యా పిల్లల కోసం మళ్లీ బానిసత్వంలోకి పోయే ఆ అమాయక హీబ్రూ బానిస స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. దేవుడు పెట్టిన నియమం ఎలాంటిదో మీకు అర్ధం అవుతుంది.